Keep Smiling.....:)
"వ్యాకరణం రాజబాట వేస్తుంది.వాడుక పిల్లబాట తొక్కుతుంది"అని కాళోజి అన్నట్టు,నా భాష తెలుగు,యాస తెలంగాణ.నేను రాసేదాంట్ల english,తెలుగు రెండూ ఉంటయ్.నేనెట్లైతె మట్లాడ్తనో,అట్లనే రాస్తా...."

Saturday, February 4, 2012

"రామాయణ విషవృక్షం"-రాముడు దేవుడా?!

"రామాయణ విషవృక్షం"( మొదటి భాగం)అనే ఈ పుస్తకం చదివి నాలో కలిగిన అలోచనలు,అభిప్రాయాలు,అన్నిటికంటె ముఖ్యంగా ఈ పుస్తకంలోని విషయాలను తెలియపరచాలనే ఉద్ధెశ్యంతో ఇది రాయడం జరిగింది..
 

"రామాయణ విషవృక్షం",(రచన-రంగనాయకమ్మ,..విశ్వనాధ సత్యనారాయణ గారు "రామాయణ కల్పవృక్షం" అని రాస్తే దానికి సమధానంగా "విషవృక్షాన్ని" రాసారని విన్నాను..అది ఎంత వరకు నిజమో తెలియదు మరి.. ),అని చూడగానే ఎదో ప్రత్యేకమైన నవల అని చదవడం మొదలుపెట్టాను...నాలుగు పుఠలు చదవగానే రాముడిని ఒక మోసగాడిగా,అజ్ఞానిగా, ఎన్నో అవలక్షనాలు,దుర్గుణాలూ ఉన్న రాజుగా రచయిత్రి చేసిన వర్ణన నచ్చక చాలా రొజులు మళ్ళీ ఆ పుస్తకం  తెరవలేదు.కొన్ని రొజుల తర్వాత 'రాముడు దేవుడు' అనే నా నమ్మకాన్ని పక్కన పెట్టి ఆ పుస్తకాన్ని తిరిగి చదవడం ప్రారంభించాను.

 అసలు ఈ పుస్తకం ముఖచిత్రమే వింతగా ఉంటుంది..శ్రీరాముడు వెనుక నడుస్తూ,లక్ష్మణుడు మూట,ముల్లె,దనుర్బాణాలూ మోస్తూ ముందు నడుస్తుంటాడు..సీత వారిరువురికి మద్యలో  ఉంటుంది..రాముడు ధీరుడైతే అడవిలో ముందు నడవాలి కానీ,పిరికి వాని లాగా వెనక నడవడం ఎందుకు? అనే సందేహం మనకి కలుగుతుంది..ఈ ముఖచిత్రాన్ని వేయమని ఒక ప్రముఖ చిత్రకారుడిని కోరితే,.."రామ-రామ" అని రాసి రచయిత్రి పంపిన డిమాండ్ డ్రాఫ్ట్ ని వెనక్కి పంపించారట..(ఆ చిత్రకారుని పేరు రచయిత్రి ప్రస్తావించలేదు కానీ,అది ఖచ్చితంగా బాపు గారే).ఇది రచయిత్రి సృష్టించిన బొమ్మ మాత్రమే అని మనం అనుకోవడానికి వీలు లేదు...వాల్మీకి రాసిన శ్లోకాలతో సహా ఉదహరిస్తూ రాముడే లక్ష్మణుడిని తన జాగ్రత్త కోసం,రక్షణ కోసం ముందు నడవమని ఆజ్ఞాపించాడని నిరూపిస్తారు రచయిత్రి.

ఇక ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం,ప్రతీ అక్షరం తర్కంతో కూడుకున్నదే...రామాయణాన్ని దోపిడీ వర్గానికి 'అందమైన కావ్యం' అని వర్ణిస్తూ...రచయిత్రి ఎంతో చక్కగా మానవ పరిణామ క్రమాన్ని..సాంఘికంగా,సామాజికంగా,రాజకీయంగా,ఆర్దికంగా మనవ జీవనాల్లో వచ్చిన మార్పులను,కుల వ్యవస్థ మొదలైన క్రమాన్ని,స్త్రీలు స్వతంత్ర హీనులుగా,బానిసలుగా,వేశ్యలుగా మారిన క్రమాన్ని,మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థగా ప్రపంచం మారిన క్రమాన్ని,ధనికులు,పేదలు,కులాలు,మతాలు,కట్టుబాట్లు ఏర్పడిన వైనాన్ని,'వేదాలు','పురాణాలు' వంటివి రాయబడిన సందర్బాన్ని,ఆదిమానవుని గణ వ్యవస్తను,ఫ్యూడల్,పెట్టుబడిదారీ,కమ్యునిస్టు  వ్యవస్తలను కూలంకషంగా విశదీకరించారు.

 రామాయణం గురించి తెలుసుకునేటప్పుడు అది చరిత్ర పరిణామ క్రమంలో ఏ దశలో వుద్బవించిందో,ఏ  వ్యవస్తలని కాపాడటానికి,ఏ వర్గాన్ని బలపరచడానికి,ఏ ధర్మాల్ని శాశ్వతంగా ఉంచడానికి నిర్దేశించబడిందో,.ఎవరి ప్రయోజనాల కోసం ప్రచారం చెయ్యబడుతుందో తెలియజెప్పటానికి చరిత్ర క్రమం అంతా వివరిస్తారు.రామాయణం కథ ఫ్యూడల్ దశను,ఫ్యూడల్ వ్యవస్థను బలపర్చడానికే పుట్టిన కథ అని రచయిత్రి అభిప్రాయం(అది ఎంత నిజమో పుస్తకంలోని రామాయణం చదువుతుంటే మనకి అర్థం అవుతుంది.ఇది రచయిత్రి సొంతగా రాసిన రామాయణం కాదు,.వాల్మీకి రామాయణమే).

ఈ పుస్తకం చదివే క్రమంలో రామ-రావణ యుద్ధం ఆర్య-ద్రవిడుల మధ్య జరిగిన ఘర్షనగా,రామాయణం ఆర్యుల కోణం నుంచీ,ఆర్యుడు రాసిన పుస్తకం కాబట్టి,శివుడిని కీర్తించే ద్రావిడులను(రావణుడు) రాక్షసులుగా చిత్రీకరించారనే కొత్త కోణంలో రామాయణాన్ని తెలుసుకుంటాం..."రాముడు ఆర్యభూమి విస్తరణకే కదా జన్మించింది.." అని విశ్వామిత్రుడు దశరధుడితో అనే మాటల వల్ల అది రుజువు అవుతుంది కూడా..
                                     అదే విశ్వామిత్రుడు దశరధుడితో "బ్రాహ్మణులకి ధాన-ధర్మాలు బాగా చేస్తున్నావా?నాస్తికులను అణచివేస్తున్నవా?కులసంకరం జరగటం లేదు కదా? శూద్రులు అందరినీ సేవిస్తూ,అణిగి మనిగి ఉంటున్నారు కదా?" లాంటి ప్రశ్నలు వేస్తాడు...అలాగే తాటకితో యుద్ధం చేసే సమయంలో రాముడితో "ప్రజలంటే బ్రాహ్మణులే,వేద శాస్త్రాలు చదవడానికి అర్హతలేని శూద్రులు,తక్కువ జాతివారు ప్రజలు కారు" అంటాడు...ఇంకో సందర్బంలో కైకేయి దశరధుడితో "ఎప్పుడూ తమ కష్టాలని పెడచెవిన పెట్టే రాజుల కోసం ప్రజలు కన్నీరు కారుస్తారా?" అంటుంది,అలాగే ఒకసారి గుహుడు లక్ష్మణుడితో "రాజకులంలో పుట్టారు,మీరు కష్టపడటం ధర్మం కాదు..మావంటి వారికి నిద్రాహారాలు లేకపోయినా పర్వాలేదు" అని అంటాడు...ఈ ప్రశ్నల వల్లా,ఈ సంబాషణల వల్లా కులవ్యవస్త ఆనాటి నుండి ఉందనీ,తక్కువ జాతి వారిని అణగదొక్కటమే లక్ష్యంగా వ్యవస్తలు,రాజులు పని చేసారని అర్థం అవుతుంది..పితృవాఖ్య పరిపాలనా,సీతా దేవి భర్తను అనుసరించి పతివ్రత అనిపించుకోవాలని అనుకోవడం మొదలైనవన్నీ పితృస్వామ్య వ్యవస్తను బలపర్చడానికీ,స్త్రీలను అదుపు,ఆజ్ఞలలో ఉంచడానికి పుట్టుకు వచ్చిన కథలు,నీతులు మాత్రమే అని తేటతెల్లమవుతుంది.

అదే విధంగా దశరధుడికి ముగ్గురు భార్యలు మాత్రమే కాక,ఇంకా 350 మంది భార్యలు ఉన్నారనీ,అసలు కైకేయిని వివాహం చేసుకునేముందు దశరధుడు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యం భరతుడికే చెందుతుందనీ,అరణ్యాలకు వెళ్ళినపుడు సీత పట్టుచీరాలే తప్ప నార చీరలు కట్టలేదని..ఇలా ప్రచారంలో లేని వాస్తవాలను ఎన్నో తెలుసుకుంటాం!!

 అలాగే దశరధుడు వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించిన తరువాత రాముడు తన తల్లి కౌసల్య తో,తమ్ముడు లక్ష్మణుడితో,భార్య సీతతో,.."తండ్రి మాట వింటేనే పుణ్యం వస్తుంది,స్వర్గ ప్రాప్తి కలుగుతుంది,అరణ్యాలకి వెళ్ళడం తోటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయ్" అని చెప్పే సన్నివేశం రామునిలోని స్వార్ద కోణాన్ని మన ముందుంచుతుంది.మరో సంధర్బం లో రాముడు లక్ష్మణుడితో "మాతో పాటు వనవాసానికి నువ్వు రావడం మంచిదైంది..లేకపోతే సీతని కాపాడటం నా ఒక్కడికీ కష్టమయ్యేది.." అని అంటాడు తన వీర లక్షణాన్ని తెలియజేస్తూ..!!
           మరో సారి తన తమ్ముడితో పినతల్లి కైకేయిని 'మదం ఎక్కిన వనిత' అని దూషిస్తాడు..తన తండ్రిని బుద్ధిహీనుడని నిందిస్తాడు,కాదు,తన మనసులోని మాటలను బయటపెడతాడు....ఈ విధంగా రాముడు స్థితప్రజ్ఞత లేని వాడిగా,రాజ్యకాంక్ష,కీర్తి కాంక్ష గలవాడిగా,భయస్తుడిగా మనకి దర్శనం ఇస్తాడు చేసే ప్రతి పనిలో,మాట్లాడే ప్రతి మాటలో...

 రాముడు లక్ష్మణుడికి చెప్పే ప్రతి పనిలో ఒక దర్పం కనిపిస్తుంది...యజమాని సేవకుడికి కార్య భారం అప్పగిస్తూ ఏ విధంగా ఆజ్ఞాపిస్తాడో,అదే స్వభావాన్ని రాముడు లక్ష్మణుడికిచ్చే ఆజ్ఞల్లో మనం గమనించవచ్చు..రాముడికీ,లక్ష్మణుడికీ  ఉన్నది అన్నదమ్ముల అనుబంధం కాదు,.యజమాని,బానిసల సంబంధం.పుస్తకం చదువుతున్నప్పుడు ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది.

 రచయిత్రి తన సహజ దోరణిలో రాయడం వలన హాస్యం,వ్యంగ్యం పాలు కూడా ఎక్కువగానే ఉంటాయి....ముఖ్యంగా దశరధుడు చనిపోయి,ఆత్మగా మారిన తరువాత వివరించిన సన్నివేశం(ఇది రచయిత్రి కల్పన కావచ్చు),లక్ష్మణుడి ఇంగితం మాట్లాడే మాటలు,గుహుడి స్వబావం వర్ణించిన తీరు,భరతుడితో రాముడి సంభాషణ గురించి చెప్పిన తీరు మనకి నవ్వు తెప్పిస్తాయి.

 ఈ విధంగా ఈ పుస్తకంలో తర్కం,హాస్యం,జ్ఞానం అన్నీ ఉన్నాయి..అలాగే ప్రతీ పాత్రా రాముడిని ఉన్నతుడిని చేయడానికి తనని తాను హీనం చేసుకునేటట్టు వాల్మీకి రాయడం వంటి విషయాలని చూపిస్తారు(వాల్మీకి రాసిన రామాయణ అనువాద శ్లోకాలని సంఖ్యలతో సహా ఉదహరిస్తారు రచయిత్రి).ఇలా కొందరికి మాత్రమె ప్రయోజనకరంగా ఉండే సంప్రదాయాలని,వాటిని బలపరిచే సామజిక స్వభావాన్ని ఉటంకిస్తుంది మన పవిత్ర గ్రంధం.

 ఈ మొదటి భాగం లో బాలకాండ,అయోధ్యకాండ,సింహాసనం చెప్పుల పాలవడం,అరణ్యకాండ గురించి రాసారు.ఈ కొన్ని విషయాలు తెలుసుకున్నందుకే రామాయణం నిజంగా ఒక విషవృక్షం అనే సంగతి మనకి బోపడుతుంది..ఎన్నో అవలక్షణాలు గల రాముడు దేవుడా? అనే సందేహం కలుగుతుంది.నిత్యం మనం స్మరించే రామాయణంలో ఇన్ని నిగూఢ విశేషాలు ఉన్నాయా అని ఆశ్చర్యం కలుగుతుంది...రాముడి స్వభావం ఇంతేనా అని బాధ కలుగుతుంది....!!

ఆస్తికుడైనా,నాస్తికుడైనా,...తర్క జ్ఞానాన్ని నమ్మే ప్రతీ ఒక్కరు చదవవలసిన పుస్తకం ఇది..

16 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

రామాయణ విషవృక్షం చడుతూ ఉన్నప్పిడు.. నేను మీకు లాగానే.. రాముడు దేవుడు కాదని జీర్ణించుకోలేక సతమతమయ్యాను. ఎందుకంటె.. చిన్నతనం నుండి మనకి తెలిసిన ఒక ఉత్తమ పురుషుడి లక్షణాలని విభిన్నంగా చూడలేక..తెలుసుకోవడానికి ఇష్ట పడక విముఖత ఏర్పడుతుంది. దాదాపు ఒక ఆరునెలలు కాలం తర్వాత నేను సహేతుకమైన వివరణలు ని బేరీజు వేసుకుని అప్పుడు ఒక నిర్ణయం కి వచ్చానేమో! మీ అభిప్రాయ పరిచయం బాగుంది.

vivek said...

@వనజ వనమాలి....అవును నిజమె,.ఈ పుస్తకంలోని విషయాలను ఒప్పుకోవడం కొంచం కష్టంగానె ఉంటుందండి....

ధన్యవాదలు..:)

రాజు గారి గుర్రం said...

హహా.. ఆమె వితండవాదమూ.. మీ బేల తనమూ...
విశ్వామితృడు కులాల గురించి మీరనుకునే అర్థం లోనే మాట్లాడాడు అనుకుంటే, అసలు ఆయన పుట్టిన కులం ఏంటో మీకు తెలుసా..
ఇంకా, ఆర్యులకి ద్రవిడులకీ(రాక్షషులకీ) యుద్ధమా, సముద్రం దాటితేనే రాక్షస మంద కనిపించింది కదా.. వాలిని చంపినపుడు, ఇది నా వంశం ఏలుబడిలో ఉన్నది, చంపగల తప్పు చేసినవారిని నేను చంపవచ్చు అంటాడు..

రాముడు లక్ష్మణుడిని చివర్లో రాజ్యం నుండి పంపించివేస్తాడు.. ఆతని నిర్ణయం ప్రకారమే.. భృఘు/దుర్వాసుడు వస్తే తలుపు తీయాల్సి వచ్చి మరణ దండణ ని ఎదుర్కొంటాడు.. దండణ మరణం అని తెలిసినా ఎందుకు తలుపు తీశావ్ అంటే ...లెకపోతె అయోధ్యనే శపిస్తానన్నాడు ఈ ముని అంటాడు లక్ష్మణుడు.. అదే లక్ష్మణా మన నిజ కర్తవ్యం.. నేనో, నువ్వో కాదు.. అయోధ్య ముఖ్యం.. లక్ష్మణుడికి అర్థం కావాలని ఎన్నో రకాలుగా రాముడు పరీక్షించ ప్రయత్నించవచ్చు.. అంత మాత్రాన అది బానిస సంబంధం కాదు...

ఇక జ్ఞాని అయినవాడు ఎంతటి వాడినైనా కూలం కషం గా విశ్లేషించవచ్చు.. తండ్రి ఐతే దశరథుడు విమర్శలకు అర్హుడు కాదా..
సంవత్సరం పాటు లంకలో ఉన్నావు.. ఈ మధ్యలో నీకు ఎటువంటి ఆలోచనలైనా కలిగి ఉండవచ్చు.. నిర్ణయం తీసుకునేందుకు నీవు స్వతంతృరాలివి .. మాతో రావాలో వద్దో నిర్ణయించుకో అంటాడు.. రాముడు.. అలాంటి వాడు.. విషం ఎక్కడ చిందాడు..
వ్రాసే వారికి బుద్ది కలగక పోవచ్చు... మీరంతా గుడ్డిగా చదివి పారేశారా రామాయణాన్ని...

ఇంకో మాట.. మనిషి జన్మ ఎత్తినవాడిని మనిషి లాగానే చూడండి.. దేవుడిని ఎందుకు చేస్తున్నారు.. తర్వాత ఎందుకు బాధపడుతున్నారు..?

vivek said...

@రాజు గారి గుర్రం గారు....మనిషి జన్మ ఎత్తినవాడిని మనిషి లాగానే చుడాలన్నదే రంగనాయకమ్మ గారు చెప్పింది....మీరు కూడా అదే చెప్తున్నారు...ఎట్టొచ్చి,చిన్నపటి నుండి రాముడు దేవుడు అని నమ్మి భధ్రాచలాలు,గుడి,గోపురాలు తిరిగిన నాలాంటి వాడికి కొంచెం బాధ గానె ఉంటుంది మరి....!! ఇకనుండీ,రాముడిని మానవుడిగానె చుస్తాను....

మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు..

Zilebi said...

karthikeyas gaaru,

రామాయణం ఒక పాత చింత కాయ పచ్చడి.

దాని మీద ఈ విష వృక్షం మరో పాత కిచిడి

ఇవన్నీ చదవి జనాలు ఎందుకు బుర్రలు పోగుట్టుకుంటారు చెప్మా ??

జిలేబి.

vivek said...

జిలేబి గారు....అసలు తెలియని విషయం ఏదైనా పాత ఎలా అవుతుంది??తెలుసుకుంటేనే కదా పాత బడిబోయేది....:)

Zilebi said...

కార్తికేయ్ ఎస్ గారు,

మీరు గడుసు వారే నండోయ్,

మీరు ఇక రామాయణం మీద ఎలాంటి పుస్తకాలు చదివినా మీ విచక్షణ దాని లోని మంచి నే గ్రహిస్తుంది అని పిస్తుంది నాకు.

కాబట్టి మీరు కల్పవృక్షమైనా, విషవృక్షమైనా చదవ వచ్చు. !!

చీర్స్
జిలేబి.

vivek said...

జిలేబి గారు....హ హ హ....మంచినే తీసుకోమని నాకన్నా గడుసు గా చెప్పిండ్రు కదా....ఏ పుస్తకం చదివినా సాధ్యమైనంత వరకు అందులో ఉన్న మంచిని,జ్ఞానబోదను తీసుకోవడనికే ప్రయత్నిస్తాను........

థాంక్ యూ.....:)

శ్యామలీయం said...

రావణసంహారం జరిగాక బ్రహ్మ, ఇంద్రాదులు యుధ్ధభూమికి విచ్చేస్తారు. వాళ్ళు తనను అవతారపురుషుడిగా అభినందిస్తుంటే రాముడన్నది యేమని? మీరేదేదో చెబుతున్నారు, నాకు తెలిసి 'ఆత్మానం మానుషం మన్యే, రామం దశరధాత్మజం' అని. సరే రంగనాయకమ్మగారి దృక్కోణంనుండి చదివి ఇన్నాళ్ళూ భారతదేశంలో శ్రీశంకరులతో సహా యెవరూ రాముడు స్వార్ధపిశాచి అనీ రామాయణం ఒక దుష్కావ్యమనీ కనిపెట్టలేకపోయారని గ్రహించామంటే చెప్పగలిగింది యేమీ లేదు.

ఆర్యులు అనే వేరే జాతివాళ్ళు వచ్చి భారతదేశాన్ని అక్రమించుకున్నారన్న చరిత్రకారులు తిర్సకరించిన సిధ్ధాంతాన్ని పట్టుకుని కమ్మూనిష్టులు పుస్తకాలూ, పుస్తకవిమర్శలూ వ్రాస్తున్నారు. కాని మన మస్తకాలేమయినాయి?

అక్కడక్కడ రంగనాయకమ్మ 'ఇది ఇలాగే జరిగింది' అని దబాయిస్తారు. తర్కం యేమిటి?

రామాయణం చారిత్రక కథనం అనుకుంటే చరిత్రకారుడు వాల్మీకి. యేది యెలా జరిగిందో ఆయన చెప్పినదే ఆధారం కదా? రామాయణం కల్పిత కథ అనుకుంటే కథకుడు వాల్మీకి. ఆయన రాసిన కథమీద ఆవిడ అదికాదు ఇది యిలాగు అనటత యేమి చెల్లుతుంది?

అయనా ఇన్ని వేల సంవత్సరాలుగా మంచిని పంచిన రామాయణం హఠాత్తుగా విషం అయిపోవటం యేమిటి. ఉదాహరణకు ఒక రామాయణ నీతి వాక్యం:

సులభాః పురుషా రాజన్ సతతమ్ ప్రియవాదినః
అప్రియస్యచ పధ్యస్య వక్తా శ్రోతాచ దుర్లభః

మంచితప్ప చెడు యేమి బోధిస్తున్నదీ శ్లోకం?

మరొకటి:

రామం దశరధం విధ్ధి మాం విధ్ధి జనకాత్మజాం
అయోధ్యాం మటవీం విధ్ధి గఛ్చ తాత యధా సుఖం.

అన్నావదినలను తల్లిదండ్రులవలె చూఢమని తల్లిబోధించటం కూడా విషప్రాయమేనా?

తప్పులనే యెన్ని వెక్కిరించదలచుకుని స్వమతానుసారవ్యాఖ్యలతో దేనినైన చిన్నబుచ్చవచ్చు. దాని వలన ప్రజలకు ప్రయోజనం యేమీ ఉండదు.

శ్యామలీయం said...

శొ, పాతది యగుచో నేమగు
పాతది యగు చింత కాయ పథ్యం బనగా
తాతలనుండి ప్రసిధ్ధం
బీతరమున మెచ్చకున్న నేమి జిలేబీ

vivek said...

శ్యామలీయం గారు...రామాయణం కథ అయినా,నిజంగా జరిగినా...అది రాయబడిన/జరిగిన కాలం నాటి స్థితి గతులనే రచయిత్రి ఎక్కువగా ప్రస్తావిస్తారు....మీరు ఎట్లైతే రెండు శ్లోకాలు చెప్పి అది మంచినే పంచింది అంటున్నారో..రంగనాయకమ్మ గారు అదే విదంగా ఎన్నో శ్లొకాలను ఉదహరిస్తూ ఆమే చెప్పదలుచుకున్నది సూటిగా,స్పష్టంగా చెప్తారు....ఒక వర్గం వారు(కమ్యూనిస్టులు) రాసినవన్నీ తిరస్కరిస్తేనే మస్తకాలు ఉన్నట్టైతే,...అంత జ్ఞానం లేకపొవడమే మంచిది.....

మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు..

.C said...

"రామాయణ విషవృక్షం" చదివితే కానీ నీ టపాకి సరైన సమాధానమివ్వలేని పరిస్థితి. ఎందుకంటే... ఆమె వ్రాసిన శ్లోకాలేవీ నువ్వు సంఖ్యలైనా ఉటంకించలేదు. అవి యేమిటో తెలిస్తే కానీ అర్థం చేసుకోలేము. అసలే సంస్కృతంలో యే మాట వ్రాసిన నానార్థాలుంటాయి. ("సీతారావణసంవాదమ్" అన్న పుస్తకమొకటుంది. అందులోని శ్లోకాలు ఒక అర్థంలో తీసుకుంటే మనకు తెలిసిన రామాయణ కథలోని ఘట్టాన్నీ, మఱో అర్థంలో తీసుకుంటూపోతే సీత రావణుడితో "ఎలాగూ రాముడు రాలేడు కానీ నన్ను పెళ్ళి చేసుకో" అని పోరుతుంటే "అది వీరలక్షణం కా"దని రావణుడు నచ్చచెబుతున్నట్టు ఉంటుంది. అంత గడుసైన భాష అది.) ఉదాహరణకి... నువ్వు వ్రాసిన "ఆర్యభూమి" అన్న పదం: భారతదేశానికి "ఆర్యావర్త"మన్న పేరుంది. వాల్మీకి అదే పేరు వ్రాస్తే ఆవిడ దాన్ని "ఆర్యులు నడయాడిన భూమి" అన్న నైఘంటికార్థం తీసుకుని "ఆర్యభూమి... అంటే ద్రవిడభూమి కానిది" అని అర్థం తీసుకుంటే సమంజసమా? (ఒకవేళ రామాయణం జఱిగినది ఆయా దేశాల్లో కతల్లో ఉన్నట్టు యే థాయ్‌లాండ్, బర్మా, ఇండోనేషియా దేశాల్లో అనుకో... అప్పుడిక యే ఆర్య-ద్రవిడ పోరాటాన్ని సూచించినట్టు? పైగా శ్యాలమీయం గారు వ్రాసినట్టు అసలు ఆర్య-ద్రవిడ చరిత్రనే యింకా తవ్వి తీస్తున్నారే తప్ప పూర్తిగా తెలుసుకోలేదు. - ఇది చదివితే కాస్త అవగాహన రావచ్చు.) కనుక, ఆ పుస్తకంలో ఉదహరించిన శ్లోకాలు తెలిస్తే కానీ యేమీ చెప్పలేము. అన్నట్టు దశరథునికి 3000 మంది భార్యలని వాల్మీకి వ్రాసినట్టు గుర్తు నాకు. రావణాసురుడికీ ఉన్నారు 300 మందేమో.

ఇక యీ పుస్తకంతో నాకున్న ముఖ్యమైన సమస్య: మనమివాళ కారు (కొ)కనుక్కున్నామనుకో... కారు కనిపెట్టక ముందు చరిత్ర యేదో వ్రాస్తున్నప్పుడు "వాళ్ళు కారు కూడా కొనుక్కోలేని పేదరికంలో మగ్గుతున్నారు (లేదా, కనుక్కోలేని బుద్ధిహీనులు)" అని వ్రాస్తే యెలా ఉంటుందో అలా అనిపిస్తుంది. ఇవాళ మనకేదో తెలిసిపోయిన జ్ఞానంతో స్త్రీవాదము, దళితవాదము, కులవాదము, ఆర్య-ద్రావిడ భేదము, పితృస్వామ్యము, అణచివేత, బూర్జువా వర్గాలు వగైరాలన్నీ పట్టుకెళ్ళి యేనాడో జఱిగిన/వ్రాసిన కావ్యానికి యెలా ఆపాదిస్తాము?!?!

చూసే దృక్కోణాన్ని బట్టి అర్థగ్రాహ్యత మాఱుతుంది. "ఘూట్లే" అని యెవఱిని అంటారో త్రివిక్రమ్ "జల్సా" సినిమాలో చెప్పారు. అది చూస్తే యిలాంటి దృక్కోణంతో రామాయణాన్ని చూస్తే యేమంటారో కూడా తెలుస్తుంది. ;-)

vivek said...

పుస్తకంలోని ప్రతీ పేజీలో కొన్ని శ్లోకాల సంఖ్యలు ఉంటాయి...అందుకే వాటిని ఇక్కడ చెప్పలేదు....

// ఇవాళ మనకేదో తెలిసిపోయిన జ్ఞానంతో స్త్రీవాదము, దళితవాదము, కులవాదము, ఆర్య-ద్రావిడ భేదము, పితృస్వామ్యము, అణచివేత, బూర్జువా వర్గాలు వగైరాలన్నీ పట్టుకెళ్ళి యేనాడో జఱిగిన/వ్రాసిన కావ్యానికి యెలా ఆపాదిస్తాము?!?! //

ఒకసారి రామాయణ విషవృక్షం చదివితే,..రచయిత్రి రాసిన సుదీర్ఘ ముందు మాటలో దీనికి సమధానం దొరుకుతుంది..తెలిసిపోయిన జ్ఞానంతో రాసినట్టు కాకుండా....ఈ స్త్రీవాదము, దళితవాదము,కులవాదము పుట్టు పూర్వాల గురించీ,పుట్టుకు రావడానికి ఆస్కారముండే,ఆస్కారమున్న విషయాలను చెప్తూ రాస్తారు...సమయం ఉన్నప్పుడు ఒకసారి పుస్తకం చదివితే అర్థం అవ్వొచ్చు...

చూసే దృక్కోణాన్ని బట్టి అర్థగ్రాహ్యత మాఱుతుంది అన్నది నిజమే....రచియిత్రి తను రామయణాన్ని చూసిన విధానాన్ని,తన దృక్కోణాన్ని ఎంతో అర్థవంతంగా,అందంగా పరిచయం చెస్తారు..ఈ పుస్తకం లోని ప్రత్యేకత అదే...

ఇక నువ్వు ఏట్లైతే //"రామాయణ విషవృక్షం" చదివితే కానీ నీ టపాకి సరైన సమాధానమివ్వలేని పరిస్థితి// అన్నావో...నాకు కూడ ఆ జల్సా సినిమా చూస్తే గాని నీ చివరి వాఖ్యం అర్థం చేసుకోలేని పరిస్థితి... :)

Subrahmanya Sarma said...

.Cగారూ..!
చాలాబాగా చెప్పారు..!
"రామాయణం విషవృక్షం" గురించి మాట్లాడడానికి మీలాగే నేను కూడా చదవలేదు.
//ఇవాళ మనకేదో తెలిసిపోయిన జ్ఞానంతో స్త్రీవాదము, దళితవాదము, కులవాదము, ఆర్య-ద్రావిడ భేదము, పితృస్వామ్యము, అణచివేత, బూర్జువా వర్గాలు వగైరాలన్నీ పట్టుకెళ్ళి యేనాడో జఱిగిన/వ్రాసిన కావ్యానికి యెలా ఆపాదిస్తాము?!?!//
అక్షరాలా నిజం..! అస్సలు ఆపాదించలేము.
అయితే, మన దేశంలో "స్వేచ్ఛ" అనే పరిభావన పేరుతో చేస్తున్న "అతి" అవధులు దాటుతోంది కదా.! నరకుడు, బలి దళితులు అయిపోవడం, తెలుగు, ఆంధ్రం వేర్వేరు అని వ్యాసాల్ని దంచెయ్యడం లాంటివన్నమాట.. అటువంటప్పుడు మీరిలాంటి సూటి ప్రశ్నలు వేస్తే ఎలాగండీ..?

Praveen Mandangi said...

వనజ గారు, చిన్నప్పుడు పుట్టి పెరిగిన పరిస్థితులలో ఏర్పడిన నమ్మకాలని మార్చుకోవడం కష్టంగానే ఉంటుంది. ఆ మధ్య వెన్నవరం ఈదారెడ్డి గారు వ్రాసిన పుస్తకంలో చలం గారి జీవిత చరిత్ర చదివాను. చలం గారు తన చిన్నప్పుడు తన పెదనాన్న గారి అమ్మాయి రమణని ప్రేమించారు. ఆ అమ్మాయి తనని వరసవ్వదు అని చెప్పి చలం గారి తండ్రే ఆ ప్రేమకి అడ్డుతగిలాడు. చలం గారి అభిమానినైన నేనే ఈ విషయం చదివిన తరువాత చలం గారు చేసిన ఈ పనిని అర్థం చేసుకోలేకపోయాను. Close-kin marriages గురించి బ్లాగుల్లో చర్చలు జరుగుతోన్న సమయంలో ఒక వ్యాఖ్య చదివిన తరువాత వరసల విషయంలో నా అభిప్రాయం మారింది. "Close-kin marriagesని కొన్ని సమాజాలలో అంగీకరిస్తారు, కొన్ని సమాజాలలో అంగీకరించరు. కానీ పెద్దమ్మ గారి పిల్లలని ఒకలాగ, మేనత్త గారి పిల్లలని ఇంకొకలాగ చూడడం మాత్రం హాస్యాస్పదం" అని ఒక వ్యాఖ్యాత వ్రాశాడు. ఆ వ్యాఖ్య చదివిన తరువాతే నాకు విషయం స్పష్టంగా అర్థమైంది. నాస్తికుణ్ణైన నాకే కొన్ని విషయాలలో అభిప్రాయాలు మార్చుకోవడానికి అనేక సంవత్సరాలు పట్టినప్పుడు నిత్యం మూఢ నమ్మకాలలో మునిగి తేలేవాళ్ళు తమ అభిప్రాయాలని అంత సులభంగా మార్చుకుంటారని అనుకోలేము.

chavakiran said...

The book is available from Kinige at here